India's Fiscal Deficit: 2024 ఏప్రిల్-నవంబరులో ద్రవ్య లోటు రూ.8.47 లక్షల కోట్లు..! 2 d ago
2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో (ఏప్రిల్-నవంబరు) ద్రవ్య లోటు వార్షిక లక్ష్యంలో 52.5 శాతానికి చేరిందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ద్రవ్య లోటు రూ.8.47 లక్షల కోట్లకు చేరింది. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్య లోటును 2024-25లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.9 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విలువ పరంగా రూ.16,13,312 కోట్లకు పరిమితం చేయాలనుకుంటోంది. 2023-24లో ఇది జీడీపీలో 5.6 శాతంగా నమోదైంది. 8 నెలల్లో ప్రభుత్వ వ్యయం- రూ.27.47 లక్షల కోట్లు (ప్రభుత్వ అంచనాల్లో 56.9%) నికర పన్ను ఆదాయం - రూ.14.43 లక్షల కోట్లు మొత్తం వ్యయంలో రూ.22.27 లక్షల కోట్లు రెవెన్యూ ఖాతాలో, రూ.5.13 లక్షల కోట్లు మూలధన పెట్టుబడుల కింద ప్రభుత్వం ఖర్చు చేసింది. రెవెన్యూ వ్యయంలో రూ.6,58,494 కోట్లు వడ్డీ చెల్లింపులకు, రూ.2,79,211 కోట్లు ప్రధాన సబ్సిడీలకు ఖర్చు చేసింది. 2024-25లో ప్రభుత్వం విధించుకున్న ద్రవ్య లోటు లక్ష్యం రూ.16.1 లక్షల కోట్లను (జీడీపీలో 4.9%) చేరుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది.
ద్రవ్య లోటు: ప్రభుత్వ వ్యయాలు, ఆదాయానికి మధ్య వ్యత్యాసం.